చనిపోయాడనుకున్న తాలిబాన్ నేత పబ్లిక్ లో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. తాలిబాన్ నాయకుడు హైబతుల్లా అఖుంద్జాదా, దక్షిణ నగరమైన కాందహార్‌లో బహిరంగంగా కనిపించాడు. అతని మరణానికి సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో ఆయన కనిపించాడు. అమీర్ ఉల్ మోమినీన్ అని పిలువబడే అఖుంద్జాదా దేశాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత బహిరంగంగా కనిపించలేదు. దీంతో హైబతుల్లా చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ శనివారం కాందహార్‌లోని జామియా దారుల్ అలూమ్ హకీమియా అనే మతపరమైన పాఠశాలను సందర్శించినట్లు తెలుస్తోంది.
మరోవైపు తాలిబాన్లు ఇప్పటికీ తమను ప్రపంచదేశాలు గుర్తించకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్థాన్, చైనా తప్ప మరే దేశం కూడా తమను అధికారికంగా గుర్తించకపోవడం పట్ల తాలిబాన్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆఫ్ఘన్ లో తమ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని, వివిధ దేశాల్లో నిలిచిపోయిన నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఆస్తులపై ఉన్న ఆంక్షలను తొలగించాలని, లేకపోతే ఇది ప్రపంచ సమస్యగా మారుతుందని తాలిబాన్లు హెచ్చరిస్తున్నారు.