ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబాన్ ప్రభుత్వం నడుస్తోంది. ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు కాస్తా ఇప్పుడు గొప్ప గొప్ప పదవుల్లోకి వెళుతూ ఉన్నారు. తాజాగా తాలిబాన్ ప్రభుత్వం 44 మంది తాలిబన్ల సభ్యులను ప్రాంతీయ గవర్నర్లు, పోలీసు చీఫ్‌లతో సహా పలు కీలక పదవుల్లో నియమించింది. ఆ దేశంలో పాలనను మెరుగుపర్చడంలో సర్కారు కీలక అడుగు వేసింది. సెప్టెంబరులో తాలిబాన్ మంత్రివర్గం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున నియామకాలు జరగడం ఇదే తొలిసారి. కాబూల్ గవర్నర్‌గా ఖరీ బార్యాల్,కాబూల్ నగర పోలీసు చీఫ్‌గా వలీ జాన్ హంజాలను సర్కారు నియమించింది. ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులే ఇప్పుడు గవర్నర్లు, పోలీసు చీఫ్ లుగా నియమితులయ్యారని తెలుస్తోంది.
తాలిబాన్ ఎయిర్ ఫోర్స్ దిశగా అడుగులు వేస్తోంది. తాలిబాన్లు సొంత ఎయిర్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఆఫ్ఘన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తరువాత ఇతర తీవ్రవాద సంస్థలు దాడులు చేస్తూ ఉండడంతో.. వీటికి ఎదుర్కోడానికి ఎయిర్ ఫోర్స్ ను కూడా సమాయత్తం చేస్తోంది. ల్యాండ్ పై నుంచి మాత్రమే కాకుండా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే తీవ్రవాదులు కాస్త భయపడతారని తాలిబాన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. గతంలో ఆఫ్ఘన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన సైనికులు, అధికారులు తిరిగి వస్తే ఎయిర్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని తాలిబాన్ ప్రభుత్వం చెబుతోంది.