తైవాన్‌లోని యుజింగ్‌కు తూర్పున 85 కిలోమీటర్ల దూరంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:14 గంటలకు భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. శనివారం కూడా అదే ప్రాంతంలో తక్కువ నష్టంతో అనేక సార్లు ప్రకంపనలు వచ్చాయి. అదే ప్రాంతంలో 24గంటల్లో 12సార్లు భూమి కంపించింది. భారీ భూకంపం రావడంతో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్ద అపార్టమెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. రాజధాని తైపీలో కూడా ప్రకంపనలు సంభవించాయి. తైవాన్‌లో భూకంపం సంభవించిన తర్వాత జపాన్ వాతావరణ సంస్థ... తైవాన్ సమీపంలోని దీవులకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు బీచ్‌కు దూరంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
తైవాన్‌లోని ఆగ్నేయ భాగంలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం టైటుంగ్ కౌంటీలో ఉందని, శనివారం సాయంత్రం అదే ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని, దీని వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వాతావరణ బ్యూరో తెలిపింది. తైవాన్ అగ్నిమాపక విభాగం, యులిలో కూలిపోయిన భవనం నుండి నలుగురిని రక్షించామని, దెబ్బతిన్న వంతెనపై నుండి వాహనం పడిపోయిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.