తనను భారత్‌కు అప్పగించవద్దని ముంబయి ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలని యూఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. భారత్‌కు పంపిస్తే తనను చిత్రహింసలకు గురిచేస్తారని పిటీషన్ లో తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ.. 26/11 ముంబయి ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నామని హామీ ఇచ్చారు.
తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్న రాణా ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ముంబయి దాడులకు ముందు ఆ కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబయిలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు చెబుతున్నారు. ముంబయిలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీలో రాణా హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. భారత్ కు రాకుండా తప్పించుకోడానికి తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా, ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి.