రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ఎంతో మంది విద్యార్థుల చదువులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. తాజాగా అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ కింద ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు ఇతర దేశాల కళాశాలల్లో తమ చదువు కొనసాగించడానికి అవకాశం కల్పించేలా చూడాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. కళాశాల ఫీజులు, అందుబాటులో ఉన్న సీట్లు వంటి నిర్దిష్ట అవసరాలను పేర్కొనే ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని సూచించింది. అందులో ట్రాన్స్ఫర్ ఆఫ్షన్ ను ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వాలని సూచించింది.
ప్రస్తుత విద్యా సంవత్సరం కోల్పోకుండా, చదివే సిలబస్‌లో మార్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అందుకని వారి కోర్సును అభ్యసించగలిగేలా, పారదర్శకతతో వివరాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉందని ధర్మాసనం తెలిపింది. విద్యార్ధులు చుట్టుపక్కల దేశాలకు వెళ్లి కళాశాలలు వెతుక్కోవాల్సిన పరిస్థితి రాకుండా కేంద్రం చర్యలు తీసుకుంటే మంచిదని తెలిపింది. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా, ఆయా దేశాలతో చర్చలు జరిపి తగిన చర్యలు కేంద్రమే చేపట్టేలా చూడాలని ధర్మాసనాన్ని న్యాయవాదులు కోరారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను యుద్ధ బాధితులుగా ప్రకటించాలని న్యాయవాదులు కోరారు. అది సైనిక పరమైన అంశాల్లోనే సాధ్యమవుతుందని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది.