శ్రీలంక దేశం ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం, రాజకీయ ప్రతిష్టంభన ఎదుర్కొంటూ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే బుధవారం తన అన్నయ్య మహింద రాజపక్సే నేతృత్వంలోని ప్రస్తుత మంత్రివర్గం రాజీనామా చేసిన తర్వాత అఖిలపక్ష(ఆల్ పార్టీ గవర్నమెంట్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలతో కలిసి అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా తాను సిద్ధంగా ఉన్నానని గోటబయ రాజపక్సే సంకీర్ణ భాగస్వాములకు తెలియజేశారు.
"ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సంక్షోభానికి పరిష్కారంగా, పార్లమెంటులో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం వహించే అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేను సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాను" అని ఆయన చెప్పారు. తన ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని అనుకుంటున్న పార్టీలు, స్వతంత్ర సంఘాల నేతలను శుక్రవారం తనను కలవాలని ఆహ్వానించారు.
"ప్రధాని మహింద రాజపక్స, మంత్రివర్గం రాజీనామా తర్వాత ఏర్పడే అఖిలపక్ష ప్రభుత్వం కూర్పు, దాని పదవీకాలం, ఆ ప్రభుత్వంలో చేయవలసిన నియామకాలు ఇతర సంబంధిత విషయాలను చర్చించి నిర్ణయించుకోవాలి." అని రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.