ఎన్నికల సంఘం అభ్యర్థన మేరకు అధ్యక్ష ఎన్నికలకు ముందు రోజు శుక్రవారం నాడు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు శ్రీలంక విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పాఠశాలలు సోమవారం తిరిగి తెరుస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం నాడు అనేక పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగిస్తామని, ఈ పాఠశాలలను గురువారం స్కూల్స్ టైమింగ్స్ ముగిసిన తర్వాత స్థానిక ప్రభుత్వ అధికారులకు అప్పగించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎన్నికల అధికారుల కార్యకలాపాలకు అవసరమైన బల్లలు, కుర్చీలు, హాలు సౌకర్యాలు కల్పించాలని అన్ని విద్యా డైరెక్టర్లు, ప్రిన్సిపాల్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
శ్రీలంక తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ శనివారం జరగనుంది. 17 మిలియన్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస, మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసానాయక మధ్య త్రిముఖ ఎన్నికల పోరు సాగనుంది. ఆర్థికంగా కుదేలైన శ్రీలంకకు ఎవరు తదుపరి అధ్యక్షులు అవుతారా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు.