పారిపోయిన అధ్య‌క్షుడు.. శ్రీలంక‌లో ఎమ‌ర్జెన్సీ విధింపు

Sri Lanka declares state of emergency after president flees.శ్రీలంక‌లో మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 July 2022 7:32 AM GMT
పారిపోయిన అధ్య‌క్షుడు.. శ్రీలంక‌లో ఎమ‌ర్జెన్సీ విధింపు

శ్రీలంక‌లో మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆ దేశ అధ్య‌క్ష‌డు గొట‌బాయ రాజ‌ప‌క్ష దేశం విడిచి పారిపోవ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హాజ్వాల‌లు క‌ట్ట‌లు తెంచుకున్నాయి. దీంతో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తు వీధుల్లోకి వ‌చ్చి త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేస్తున్నారు. గొట‌బాయ రాజ‌ప‌క్స పారిపోయేందుకు ప్ర‌ధాని ర‌ణిల్ విక్ర‌మ్ సింఘే సాయం చేశాడ‌ని ర‌ణిల్ విక్ర‌మ్ సింఘే నివాసాన్ని ముట్ట‌డించేందుకు ఆందోళ‌న‌కారులు య‌త్నించారు. అయితే.. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఆందోళ‌న‌కారుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. టియ‌ర్ గ్యాస్‌తో ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు భ‌ద్ర‌తాబ‌ల‌గాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

ఈనేప‌థ్యంలో దేశంలో ప‌రిస్థితులు అదుపు త‌ప్పుతుండ‌డంతో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తాత్కాలిక అధ్య‌క్షుడి హోదాలో ర‌ణిల్ విక్ర‌మ్ సింఘే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి విధిస్తున్న‌ట్లు తెలిపింది.

అంట‌నోవ్‌-32 విమానంలో బుధ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో రాజ‌ప‌క్స‌, భార్య ఇద్ద‌రు బాడీగార్డుల‌తో మాల్దీవుల‌కు వెళ్లిపోయారు. ఈ విష‌యాన్ని ఆర్మీ కూడా ధ్రువీక‌రించింది. కాగా.. ఈ రోజు రాజీనామా చేస్తాన‌ని ఇంత‌ముందే రాజ‌ప‌క్స వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. దేశం విడిచి పోయేందుకు అనుమ‌తి ఇస్తేనే ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని మంగ‌ళ‌వారం కొత్త మెలిక పెట్టాడు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు దేశం విడిచి వెళ్లిపోయారు.

Next Story