అప్పులు చెల్లించలేమని తేల్చేసిన శ్రీలంక
Sri Lanka Announces Defaulting On All Its External Debt. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక అప్పులు కట్టలేమని ఇతర దేశాలకు చెప్పేసింది.
By Medi Samrat Published on 12 April 2022 11:26 AM GMTతీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక అప్పులు కట్టలేమని ఇతర దేశాలకు చెప్పేసింది. విదేశాలకు చెల్లించాల్సిన $51 బిలియన్ల విదేశీ రుణాన్ని చెల్లించలేక పోతోంది శ్రీలంక. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ బెయిలౌట్‌కు ముందు దేశం.. విదేశీ ప్రభుత్వాల నుండి రుణాలతో సహా అన్ని బాహ్య బాధ్యతలపై డిఫాల్ట్ అవుతుందని శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమ ఆర్థిక స్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి ప్రభుత్వం చివరి ప్రయత్నంగా మాత్రమే అత్యవసర చర్యను తీసుకుంటుందని తెలిపింది. రుణదాతలు తమకు చెల్లించాల్సిన ఏవైనా వడ్డీ చెల్లింపులను క్యాపిటలైజ్ చేసుకోవచ్చు లేదా శ్రీలంక రూపాయల్లో చెల్లింపును ఎంచుకోవచ్చు అని వెల్లడించింది. ప్రభుత్వం తన విదేశీ కరెన్సీ నిల్వలను కాపాడుకోవడానికి, ఇప్పుడు డిఫాల్ట్ చేసిన అప్పులను తీర్చడానికి వాటిని ఉపయోగించడానికి దిగుమతి నిషేధాన్ని విధించింది. 5,100 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.88 లక్షల కోట్ల) అప్పులను కట్టబోమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి బెయిల్ అవుట్ ఇంకా పెండింగ్ లోనే ఉందని, కాబట్టి అప్పులను కట్టలేమని పేర్కొంది.
తమకు అప్పులిచ్చిన దేశాలు వడ్డీ కావాలంటే దేశంలోనే వేరే ఇతర మార్గాలనుంచైనా తీసుకోవచ్చని లేదా శ్రీలంక రూపీల్లో కట్టించుకునేందుకు అంగీకరించాలని తేల్చి చెప్పింది. మరో వైపు రాజపక్సే రాజీనామా చేయాల్సిందేనని నిరసనకారులు పట్టుబట్టారు. అధ్యక్షుడి రాజీనామా కోసం డిమాండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని అరాచకంలోకి నెట్టేస్తున్నాయని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న సమయంలో 'కొవిడ్ లాక్‌డౌన్'కారణంగా విదేశీ మారక నిల్వలు మరింత క్షీణించాయని మహింద రాజపక్స పేర్కొన్నారు. ఎన్ని రోజులు రోడ్డెక్కి ఎంత తీవ్రంగా నిరసనలు చేస్తే.. అంతే తీవ్రంగా, వేగంగా డాలర్లను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు.