స్పుత్నిక్-వి రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్. మహమ్మారి నివారణకు తొలుత అందుబాటులోకి వచ్చిన టీకా. అయితే, ఈ వ్యాక్సిన్ డెల్టా సహా కరోనా అన్ని వేరియంట్లపై సమర్థంగా పని చేస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడయ్యింది. ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడమాలజీ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) తాజాగా ఈ అధ్యయన ఫలితాలను వెల్లడించాయి.
ఆల్ఫా బీ.1.1.7 (యూకే), బీటా బీ.1.351 (సౌతాఫ్రికా), గామా పీ.1 (బ్రెజిల్), డెల్టా బీ.1.617.2, బీ.1.617.3 (ఇండియా) ఆయా దేశాలలో తొలిసారి కనిపించిన వేరియంట్లను అడ్డుకునే టైటర్లను స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసినట్లు గమలేయా ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. నేరుగా వైరస్‌నే ఉపయోగించి చేసిన వైరస్ న్యూట్రలైజింగ్ యాక్టివిటీ (వీఎన్ఏ)ని అంచనా వేసి ఈ అధ్యయనం జరిపినట్లు తెలిపింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కనిపించిన వేరియంట్లతో సహా కరోనా తొలి వేరియంట్ అయిన బీ.1.1.1 ను స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఎలా అడ్డుకుంటుందో పరిశీలించింది. అలాగే ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో కలిసి వ్యాక్సిన్ కాక్‌టెయిల్స్‌ను తయారు చేసే దిశగా గమలేయా, ఆర్డీఐఎఫ్ అధ్యయనం నిర్వహిస్తోంది.