పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం కారణంగా శ్రీలంకలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఆర్థిక మాంద్యం కారణంగా, ద్వీప దేశంలోని ప్రజలు ఇంధనం, ఆహారం, మందులు కొనడానికి గంటల తరబడి క్యూలో ఉన్నారు. చాలా మంది ఖాళీ చేతులతో వెళ్లిపోయారు. కొలంబోలోని ఒక సూపర్‌మార్కెట్ లో కూరగాయల ధరలు రెండింతలు పెరిగాయి. బియ్యం, గోధుమలు వంటి వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బియ్యం ధర కిలో రూ. 220 ఉండగా.. గోధుమల ధరలు రూ. 190 చొప్పున విక్రయించబడుతున్నాయి. కిలో పంచదార రూ.240 పలుకగా, కొబ్బరినూనె లీటరు రూ.850కి లభిస్తోంది. ఒక్క గుడ్డు ధర రూ. 30 ఉంది. 1 కిలో పాలపొడి ప్యాక్ ఇప్పుడు రూ.1900కి రిటైల్ గా అమ్ముతున్నారు.
ఫిబ్రవరిలో శ్రీలంక రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే 17.5 శాతానికి చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం 25 శాతానికి పైగా పెరిగింది. ఆహారం, తృణధాన్యాల ధరలు భారీగా పెరిగిపోయాయి. మందులు, పాలపొడి కొరత కూడా తీవ్రంగా ఉంది. సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. రాజధానితో సహా దేశంలోని అనేక ప్రాంతాలలో నిరసనలు చెలరేగాయి, నిత్యావసర వస్తువుల కొరత, సుదీర్ఘ విద్యుత్తు అంతరాయాలకు రాజపక్సే ప్రభుత్వంపై ఆందోళనకారులు విరుచుకుపడుతున్నారు. విస్తృతమైన అశాంతిని అణిచివేసేందుకు, అధ్యక్షుడు గోటబయ రాజపక్స అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అంతేకాకుండా 36 గంటల పాటు కర్ఫ్యూ విధించారు.