మోదీతో స్నేహాన్ని ప్ర‌పంచానికి తెలియజెప్పిన ట్రంప్‌.. వింటూ నిల‌బ‌డ్డ పాక్ ప్ర‌ధాని

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈజిప్ట్‌లో జరిగిన గాజా శాంతి సదస్సులో ప్రధాని మోదీతో తన సంబంధాన్ని ప్రపంచానికి తెలియజేశారు.

By -  Medi Samrat
Published on : 14 Oct 2025 9:08 AM IST

మోదీతో స్నేహాన్ని ప్ర‌పంచానికి తెలియజెప్పిన ట్రంప్‌.. వింటూ నిల‌బ‌డ్డ పాక్ ప్ర‌ధాని

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈజిప్ట్‌లో జరిగిన గాజా శాంతి సదస్సులో ప్రధాని మోదీతో తన సంబంధాన్ని ప్రపంచానికి తెలియజేశారు. భారతదేశం గొప్ప దేశం. అక్క‌డ నాకు చాలా మంచి స్నేహితుడు ఉన్నారని మోదీని ఉద్దేశించి అన్నారు. ట్రంప్‌ ఈ మాటలు చెబుతుంటే.. పాకిస్థాన్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ వెనుక నిలబడి వింటున్నారు.

సమ్మిట్‌లో ప్రపంచ నాయకులను ఉద్దేశించి ట్రంప్.. "భారతదేశం గొప్ప దేశం.. నాకు అక్క‌డ‌ చాలా మంచి స్నేహితుడు ఉన్నారు. ఆయ‌న‌ అద్భుతమైన పని చేసారు. పాకిస్తాన్-భారతదేశం చాలా బాగా కలిసిపోతాయని నేను భావిస్తున్నాను" అని అన్నారు.

"భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో సహా అనేక అంతర్జాతీయ వివాదాలను నేను సుంకాల ద్వారా పరిష్కరించాను" అని ట్రంప్ శిఖరాగ్ర సమావేశానికి ఒక రోజు ముందు ఎయిర్ ఫోర్స్ వన్‌లో అన్నారు. మీరిద్దరూ యుద్ధం చేసి అణ్వాయుధాలను ఉపయోగించాలనుకుంటే.. నేను 100%, 150%, 200% సుంకాలు విధిస్తానని హెచ్చ‌రించారు. తన బెదిరింపు తర్వాత 24 గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 9న ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అదే వాదనను పునరావృతం చేశారు.

భారత్-పాకిస్థాన్ మధ్య ఏడు విమానాలను కూల్చివేశారని, రెండు దేశాలు యుద్ధం అంచున ఉన్నాయని, మీరు చర్చలు జరపకుంటే మీతో వ్యాపారం చేయబోమని, భారీగా సుంకాలు విధిస్తామని చెప్పాను.. ఆ తర్వాత 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదిరిందన్నారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌ను భార‌త్ ఖండించింది.

'ఆపరేషన్ సింధూర్‌' తర్వాత 2025 మేలో కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుండి.. యుద్ధం ఆపడంలో తాను ముఖ్యమైన పాత్ర పోషించానని ట్రంప్ పదేపదే ప్రకటించడం గమనార్హం. ట్రంప్ తన వాణిజ్యం, సుంకాల విధానానికి తరచుగా క్రెడిట్ ఇచ్చారు. అయితే, ఎటువంటి మూడవ పక్షం మధ్యవర్తిత్వం లేకుండానే ఇరు పక్షాల సైనిక నాయకత్వం మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారా యుద్ధాన్ని నిలిపివేసే నిర్ణయం తీసుకున్నట్లు భారత్ పేర్కొంది.

Next Story