పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో సోమవారం మధ్యాహ్నం మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ బాంబు పేలుడు ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 93కి పెరిగింది, 221 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిధిలాల నుండి మిగిలిన మృతదేహాలను వెలికితీస్తూ ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం ప్రార్థనలకు హాజరైన ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు, దీనితో పైకప్పు కూలిపోయిందని అధికారులు తెలిపారు. పేలుడు ఆత్మాహుతి దాడిగా కనిపిస్తోందని, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లోని సైట్‌లో అనుమానాస్పద బాంబర్ తల స్వాధీనం చేసుకున్నట్లు క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ (CCPO) మొహమ్మద్ ఐజాజ్ ఖాన్ జియో టీవీకి తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా తాత్కాలిక ముఖ్యమంత్రి ముహమ్మద్ ఆజం ఖాన్ మంగళవారం ఈ దాడి తరువాత ప్రావిన్స్‌లో ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది పోలీసులు, పోలీసు అధికారులే ఉన్నారు. దాడికి లక్ష్యంగా పెట్టుకున్న మసీదు విశాలమైన కాంపౌండ్‌లో వుంది. ఆ కాంపౌండ్‌లోనే నగర పోలీసు ప్రధాన కార్యాలయం, ఇంటెలిజెన్స్, తీవ్రవాద నిరోధక దళం కార్యాలయాలు ఉన్నాయి. ఈ దాడి నేపథ్యంలో దేశమంతా అప్రమత్తతను ప్రభుత్వం ప్రకటించింది.