హోటల్ లో మైనర్ బాలికలను కలవడానికి వచ్చిన 67 ఏళ్ల వ్యక్తి.. కాల్చి పడేసిన పోలీసులు
అమెరికాలో మైనర్ బాలికలను కలవడానికి వచ్చిన 67 ఏళ్ల వ్యక్తిని పోలీసులు కాల్చి పడేశారు.
By M.S.R Published on 22 April 2024 11:22 AM ISTఅమెరికాలో మైనర్ బాలికలను కలవడానికి వచ్చిన 67 ఏళ్ల వ్యక్తిని పోలీసులు కాల్చి పడేశారు. ఏడు, పదకొండు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలను కలుస్తున్నట్లు భావించి హోటల్‌కు వచ్చిన 67 ఏళ్ల వ్యక్తిని సియాటెల్ పోలీసులు ఇటీవల కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (SPD) బాడీ క్యామ్ ఫుటేజీని విడుదల చేసింది. హోటల్ తలుపు తెరిచిన తర్వాత నిందితుడు పోలీసులపై తుపాకీని తీస్తున్నట్లు చూపిస్తుంది. కాల్చి చంపే ముందు పోలీసులకు, వ్యక్తికి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి బుధవారం తుక్విలాలోని డబుల్ ట్రీ సూట్స్ హోటల్‌కు చేరుకున్నాడు. అక్కడ అతన్ని వాషింగ్టన్ స్టేట్ ఇంటర్నెట్ క్రైమ్స్ ఎగైనెస్ట్ చిల్డ్రన్ టాస్క్‌ఫోర్స్‌కు సంబంధించిన అధికారులు, పలువురు SPD అధికారులు కలుసుకున్నారు. అతన్ని అరెస్టు చేయడానికి వేచి ఉన్నారు. ఆ వ్యక్తి తుపాకీ తీసి దాడి చేయాలని అనుకున్న కొన్ని సెకన్ల వ్యవధిలో పోలీసు అధికారులు అతడిని కాల్చిచంపారు. అయితే పోలీసులు అండర్‌కవర్ ఆపరేషన్‌ను ఏర్పాటు చేయడానికి దారితీసిన వివరాలను ఇంకా స్పష్టంగా తెలియజేయలేదు.
అతడు తుపాకీ తీస్తూ ఉండడంతో పోలీసు అధికారులు స్ప్లిట్-సెకండ్‌లో స్పందించాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు తెలిపారు. పీడోఫైల్ నేరస్థులు ఎన్నో దాడులకు తెగబడుతూ ఉంటారని.. కొన్ని కొన్ని సార్లు వారి వలన చుట్టుపక్కల వ్యక్తులకు కూడా ఇబ్బందులు కలగవచ్చని అన్నారు. పోలీసులు తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.