47 ఏళ్ల సౌదీ ఉపాధ్యాయుడు, అసద్ బిన్ నాసర్ అల్-గమ్డి తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించినందుకు 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవించనున్నాడు. అసద్ బిన్ నాసర్ అల్-గమ్డిని నవంబర్ 2022లో జెడ్డాలోని అల్-హమ్దనేయాలోని అతని ఇంటిలో రాత్రిపూట అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో అనేక నేరాలకు సంబంధించి సౌదీ అరేబియా ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ మే 29న అతన్ని దోషిగా నిర్ధారించింది.
అతను మూడు నెలల పాటు జెడ్డాలోని దహబాన్ జైలులో నిర్బంధించారు. దాదాపు రెండు నెలలపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. జనవరి 11, 2023న కుటుంబ సభ్యులను తొలిసారి కలుసుకున్నాడు. దేశ భద్రతకు హాని కలిగించే విధంగా ట్విట్టర్‌లో పోస్ట్‌లను పెట్టినందుకే అల్-గమ్డిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మతాన్ని, రాజును, న్యాయాన్ని సవాలు చేయడంతో అతడిని జైలుపాలు చేశారంటూ మానవహక్కుల విభాగం నివేదించింది. విజన్ 2030 సంస్కరణల ఎజెండాకు సంబంధించిన ప్రాజెక్టులను విమర్శించినందుకు అరెస్టు చేశారని HRW పేర్కొంది.