101 మందిని ఉరి తీసిన సౌదీ.. పాక్ పౌరులే ఎక్కువ.. ఎంతమంది భారతీయులు ఉన్నారంటే..
ఈ సంవత్సరం సౌదీ అరేబియాలో 100 మందికి పైగా విదేశీయులను ఉరితీశారు.
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 11:45 AM ISTఈ సంవత్సరం సౌదీ అరేబియాలో 100 మందికి పైగా విదేశీయులను ఉరితీశారు. మానవ హక్కుల సంస్థను ఉటంకిస్తూ వార్తా సంస్థ AFP ఈ సమాచారాన్ని అందించింది. గత మూడేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు ఎక్కువ. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై శనివారం యెమెన్ జాతీయుడిని నజ్రాన్‌లోని నైరుతి ప్రాంతంలో ఉరితీశారు. దీని తర్వాత.. ఈ ఏడాది మరణశిక్ష పడిన మొత్తం విదేశీయుల సంఖ్య 101కి పెరిగింది.
సౌదీ అరేబియా 2022, 2023 సంవత్సరాల్లో 34 మంది విదేశీ పౌరులకు మరణశిక్ష విధించింది. సౌదీ అరేబియా ఒక సంవత్సరంలో ఇంత మంది విదేశీయులకు మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి అని యూరోపియన్-సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, ESOHR లీగల్ డైరెక్టర్ తహా అల్-హజ్జీ తెలిపారు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం.. మరణశిక్షల విషయంలో చైనా, ఇరాన్ తర్వాత సౌదీ అరేబియా మూడవ స్థానంలో ఉంది. ఉరిశిక్షకు గురైన విదేశీ పౌరుల్లో పాకిస్థాన్, యెమెన్, సిరియా, నైజీరియా, ఈజిప్ట్, జోర్డాన్, ఇథియోపియా పౌరులు ఉన్నారు. వీరిలో పాకిస్థాన్ నుంచి 21 మంది, యెమెన్ నుంచి 20 మంది, సిరియా నుంచి 14 మంది, నైజీరియా నుంచి 10 మంది, ఈజిప్ట్ నుంచి తొమ్మిది మంది, జోర్డాన్ నుంచి ఎనిమిది మంది, ఇథియోపియా నుంచి ఏడుగురు ఉన్నారు. సూడాన్, ఇండియా, ఆఫ్ఘనిస్థాన్‌లకు చెందిన ముగ్గురు చొప్పున, శ్రీలంక, ఎరిట్రియా, ఫిలిప్పీన్స్‌లకు చెందిన ఒక్కొక్కరిని ఉరితీశారు.
దౌత్యవేత్తలు, సామాజిక కార్యకర్తలు స్పందిస్తూ.. విదేశీ నిందితులు న్యాయమైన విచారణను అందుకోలేదని చెప్పారు. దోషులుగా ఉన్న విదేశీ పౌరులు పెద్ద డ్రగ్ డీలర్ల బాధితులుగా మారారు. అరెస్టు చేసినప్పటి నుంచి ఉరి తీసే వరకు నిందితులు తమ వాదనలను కోర్టు ముందుంచేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.