రష్యా వశమైన మేరియుపోల్.. 'విముక్తి' అంటూ పుతిన్ ప్రకటన
Russia's Vladimir Putin hails 'liberation' of Mariupol in Ukraine.ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను
By తోట వంశీ కుమార్ Published on 21 April 2022 4:05 PM ISTఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. కీలక నగరాలపై పట్టు సాధించేందుకు రష్యా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తోంది. ఇటు ఉక్రెయిన్ కూడా అదే స్థాయిలో ప్రతిఘటన చేస్తుండడంతో దాదాపుగా రెండు నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పుతిన్ పెద్ద విజయమే సాధించారు. ఉక్రెయిన్‌లోని మేరియుపోల్ నగరంపై రష్యా సేనలు పట్టు సాధించాయి. అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్ మినహా ఉక్రేనియన్ ఓడరేవు నగరాన్ని రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగ్ ప్రకటించారు.
దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్ నుంచి మేరియుపొల్‌కు విముక్తి లభించిందన్నారు. అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్ లో దాదాపు 2 వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఉండే అవకాశం ఉందని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగ్.. పుతిన్‌కి చెప్పారు. రష్యా సైనికుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని దానిపై దాడి చేయడానికి బదులు దాన్ని ముట్టడించాలని తన సైన్యానికి పుతిన్ సూచించారు. లోపల ఉన్న ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవాలన్నారు. వారికి ఎలాంటి హాని తలపెట్టమని, వైద్య సాయం కూడా అందిస్తామన్నారు.
ఇక మేరియుపోల్ పై పట్టు సాధించడం రష్యాకు అత్యంత కీలకం. ఎందుకంటే 2014లో పుతిన్ ఆక్రమించిన క్రిమియాకు, రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌కు మధ్య మేరియుపొల్ నగరం ఉంది. ఇప్పుడు ఇది రష్యా వశం కావడంతో.. ఈ రెండు ప్రాంతాల మధ్య భూ మార్గంలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.