ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
Russian President Vladimir Putin praises Narendra Modi.భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని
By తోట వంశీ కుమార్ Published on 28 Oct 2022 11:35 AM ISTభారత ప్రధాని నరేంద్ర మోదీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. మాస్కోలోని థింక్ ట్యాంక్ వాల్డాయ్ డిస్కషన్ క్లబ్ వార్షిక ప్రసంగంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రసంగించారు. మోదీ నాయకత్వంలో భారత దేశం చాలా పురోగతి సాధించిందన్నారు. మేకిన్ ఇండియా అనేది ప్రధాని మోదీ అద్భుతమైన ఆలోచన అని, ఇది ఆర్థికపరంగానే కాకుండా నైతిక పరంగా కూడా చాలా గొప్ప కార్యక్రమం అని పుతిన్ చెప్పారు.
బ్రిటీష్ పాలన నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుదలను పుతిన్ ప్రశంసించారు. 1.5బిలియన్ల ప్రజలు, అభివృద్ధి కారణంగా ప్రతి ఒక్కరూ వారిని గౌరవిస్తారని పేర్కొన్నారు. ఇక భారత్ తో రష్యాకు ప్రత్యేకమైన బంధాలు ఉన్నాయని చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య బలమైన స్నేహం ఉందన్నారు. రెండు దేశాల మధ్య ఎప్పుడూ ఏ సమస్య రాలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయని తెలిపారు.
భవిష్యత్తులోనూ ఈ బంధం కొనసాగుతుందని చెప్పారు. ఇక భారత్‌లో వ్యవసాయం కోసం ఎరువుల సరఫరా పెంచాలని ప్రధాని మోదీ కోరారని, ఈ నేపథ్యంలో సరఫరాను 7.6శాతం పెంచినట్లు పుతిన్ పేర్కొన్నారు. దీంతో వ్యవసాయంలో వాణిజ్యం దాదాపు రెండింతలు పెరిగిందన్నారు.
పశ్చిమ దేశాలపై పుతిన్ మండిపడ్డారు. వాటి చర్యలకు తగిన ప్రతిఫలం అనుభవిస్తాయని హెచ్చరించారు. ప్రపంచంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఆ దేశాలు ప్రయత్నిస్తుంటాయని మండిపడ్డారు.