రష్యన్ కోవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ Vను రూపొందించడంలో సహాయపడిన శాస్త్రవేత్తలలో ఒకరైన ఆండ్రీ బోటికోవ్ ను అతడి అపార్ట్‌మెంట్‌లో బెల్ట్‌తో గొంతు నులిమి చంపేశారు. హత్యకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు శనివారం రష్యన్ మీడియా నివేదిక తెలిపింది. గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథమెటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేసిన బోటికోవ్ (47) గురువారం తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్ రష్యన్ ఫెడరేషన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీని ఉటంకిస్తూ కథనాన్ని పేర్కొంది.
హత్య జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఓ బెల్టుతో బోటికోవ్ మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. రష్యాలోని గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మాథమేటిక్స్ సహకారంతో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. బోటికోవ్ గమలేయా రీసెర్చ్ సెంటర్ లో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. బొటికోవ్ ను అప్పట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ద ఫాదర్లాండ్ అవార్డుతో సత్కరించారు. బొటికోవ్ మరణంపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.