ఉక్రెయిన్‌పై గత 10 రోజులుగా విధ్వంసకర దాడులు చేస్తోంది రష్యా. క్షిపణులు, బాంబు దాడులు, సైనిక చర్యతో విరుచకుపడుతున్న వేళ.. తాజాగా ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది రష్యా. యుద్ధభూమిలో చిక్కుకున్న పౌరులను తరలించేందుకు రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. మాస్కో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుండి కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. మానవతా కారిడార్లను తెరవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రష్యా అధికారిక మీడియా స్పుత్నిక్ తెలిపింది. రెండో దఫా జరిగిన చర్చల్లో మానవతా కారిడార్లు తెరవాలని ఉక్రెయిన్, రష్యా దేశాలు అంగీకారాని వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నారు.
ఉక్రెయిన్‌లో మరియపోల్, వోల్నవోఖ్ నగరాల్లోని పౌరులను సురక్షితంగా తరలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే వోల్నవోఖ్, మరియపోల్ నగరాలను చుట్టుముట్టిన రష్యా.. ఇతర దేశాల నుండి వస్తున్న ఒత్తడితో కాస్తా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరో వైపు యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఒక మిలియన్ కంటే ఎక్కువ ఉక్రేనియన్లు పొరుగు దేశాలకు పారిపోయారు. సంక్షోభంపై మూడో రౌండ్ చర్చల కోసం ఉక్రేనియన్, రష్యా ప్రతినిధులు ఈ వారాంతంలో సమావేశం కావాలని ప్లాన్ చేస్తున్నారు.