బ్రిటన్ ప్రధాన మంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్ పార్లమెంటులో అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా సోమవారం ఎన్నికైన సునాక్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 మంగళవారం ఆహ్వానం పలికారు. ఈ పిలుపు అందుకున్న సునాక్ ఏమాత్రం ఆలస్యం చేయకుండానే బ్రిటన్ ప్రధానిగా పదవీ ప్రమాణం చేశారు. త్వరలోనే ఆయన తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. బ్రిటన్ చరిత్రలో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశ ప్రధాని పదవిని చేపట్టడం ఇదే తొలి సారి.
ఇటీవలే జరిగిన ప్రధాని ఎన్నికల్లో సునాక్ పై విజయం సాధించిన లిజ్ ట్రస్ కేవలం 45 రోజులకే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..! ప్రధాని పదవికి నామినేషన్ గడువు ముగిసే సమయానికి సునాక్ ఒక్కరి నామినేషనే బరిలో ఉండటంతో ఆయననే కన్జర్వేటివ్ పాప్టీ తమ నేతగా ఎన్నుకుంది. అయితే రిషి సునాక్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టకపోతే మాత్రం తీవ్ర వ్యతిరేకతను రిషి ఎదుర్కోవాల్సి ఉంటుంది.