కొంతమందిని సెలెక్ట్ చేసి కాల్చి చంపారు.. ట్రైన్ హైజాక్ నుంచి ప్రాణాలతో బయటపడ్డ బాధితులు మాటలు వింటే..
పాకిస్తాన్‌లో మార్చి 11న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది.
By Medi Samrat
పాకిస్తాన్‌లో మార్చి 11న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. బలూచిస్థాన్‌లోని కుచ్చి జిల్లాలోని మాచ్ టౌన్‌లోని అబ్-ఎ-ఘమ్ ప్రాంతంలో రెబల్స్ రైలును హైజాక్ చేశారు. సాయుధులైన వ్యక్తులు రైలుపై కాల్పులు జరపడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలులో 440 మంది ప్రయాణికులు ఉన్నారు. తిరుగుబాటుదారులు 21 మంది బందీలను చంపారు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకారం.. మొత్తం 33 మంది దాడికి పాల్పడినవారు భద్రతా దళాలచే చంపబడ్డారు.. మిగిలిన ప్రయాణీకులందరినీ రక్షించారు.
తిరుగుబాటుదారుల చేతిలో బందీలుగా ఉన్న కొందరు ప్రయాణికులు తమకు ఎదురైన కష్టాలను వివరించారు. రైలును స్వాధీనం చేసుకున్న తర్వాత.. ముష్కరులు ప్రయాణీకుల గుర్తింపు కార్డులను తనిఖీ చేసి.. ఆపై కొన్ని కుటుంబాలను విడిచిపెట్టినట్లు ప్రయాణికులు తెలిపారు.
"వారు (తిరుగుబాటుదారులు) మమ్మల్ని ఒక్కొక్కరిగా రైలు నుండి బయటకు రమ్మని పిలిచారు. మహిళలను వేరు చేసి, వారిని విడిచిపెట్టాలని కోరారు. వృద్ధులను కూడా విడిచిపెట్టారు" అని తిరుగుబాటుదారుల నుండి తప్పించుకున్న మహ్మద్ నవీద్ AFP వార్తా సంస్థతో అన్నారు. దీని తరువాత సుమారు 185 మందిని తిరుగుబాటుదారులు రైలు నుండి బయటకు రావాలని కోరారు. ప్రయాణికులకు ఎలాంటి హాని జరగదని చెప్పారు. మేము బయటకు రాగానే కొంతమందిని సెలెక్ట్ చేసి కాల్చిచంపారని పేర్కొన్నారు.
38 ఏళ్ల క్రైస్తవ కార్మికుడు బాబర్ మాసిహ్ బుధవారం AFPతో మాట్లాడుతూ.. అతను.. అతని కుటుంబ సభ్యులు కూడా రైలులో ఉన్నారని చెప్పారు. మా కుటుంబంలోని మహిళా సభ్యులు మమ్మల్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేయడంతో తిరుగుబాటుదారులు మమ్మల్ని విడిచిపెట్టారు. రైల్లోంచి దిగి పారిపోమని తిరుగుబాటుదారులు చెప్పారు. వెనక్కి తిరిగి చూడకూడదన్నారు. మేము నడుస్తున్నప్పుడు.. మాతో పాటు చాలా మంది రైలు నుండి పారిపోవడాన్ని మేము చూశాము అని పేర్కొన్నారు.
పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాన్‌వాలా జిల్లాకు చెందిన నోమన్ అహ్మద్ కూడా రైలులో ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ..పేలుడు శబ్దం వినగానే.. కాల్పులు జరగకుండా ఉండేందుకు మేం నేలపై పడుకుని డోర్‌ను మూసేశాం. కొద్దిసేపటి తర్వాత ఒక ఉగ్రవాది రైలు లోపలికి ప్రవేశించి ఇతర ప్రయాణికుల నుండి మహిళలను, వృద్ధులను వేరు చేశాడు. రైలు నుంచి బయటకు రావాలని ఉగ్రవాది ప్రజలను కోరాడు. కొంతమంది బయటకు రావడానికి నిరాకరించడంతో కాల్పులు జరిపారని పేర్కొన్నారు.
క్వెట్టా నుంచి ఉత్తరాన ఉన్న పెషావర్‌కు రైలు వెళ్తోంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సొరంగం గుండా వెళుతుండగా, ఉగ్రవాదులు రైలు పట్టాలను పేల్చివేసి, ఇంజిన్‌ను, తొమ్మిది కోచ్‌లను నిలిపివేశారని అధికారులు తెలిపారు.