శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమసింఘే ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు గోటబాయ రాజపక్స దేశాన్ని విడిచి సింగపూర్‌కు పారిపోవడంతో.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ప్రధాని విక్రమసింఘేనే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు. చీఫ్ జస్టిస్ జయంత్ జయసూర్య సమక్షంలో ఇవాళ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. రాజపక్స అధికారికంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబయవర్దనే తెలిపారు.
అధ్యక్షుడు, ప్రధానమంత్రి నివాసాలను గతవారం ముట్టడించిన నిరసనకారులు వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు. గొటబాయ రాజపక్స రాజీనామా చేసిన విషయం తెలిసిన శ్రీలంక ప్రజలు సంబరాలు చేసుకున్నారు. వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు చేశారు. తనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం, అధ్యక్ష భవనాన్ని ప్రజలు ముట్టడించడంతో గొటబాయ గత వారం అధ్యక్ష భవనాన్ని విడిచి పరారయ్యారు. మాల్దీవులకు పారిపోయిన ఆయన అక్కడి నుంచి సింగపూర్ వెళ్లిపోయారు.