ప్ర‌ధాని ప‌ద‌వికి రణిల్ విక్రమసింఘే రాజీనామా

Ranil Wickremesinghe resigns as Sri Lanka Prime Minister. శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే శ‌నివారం తన పదవికి రాజీనామా చేశారు.

By Medi Samrat  Published on  9 July 2022 9:15 PM IST
ప్ర‌ధాని ప‌ద‌వికి రణిల్ విక్రమసింఘే రాజీనామా

శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే శ‌నివారం తన పదవికి రాజీనామా చేశారు. అఖిలపక్ష ప్రభుత్వం అధికారాన్ని చేపట్టేందుకు వీలుగా ఆయ‌న రాజీనామా చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతకుముందు రోజు జరిగిన పార్టీ సమావేశంలో విక్రమసింహే తన పదవి నుండి వైదొలగడానికి.. అఖిలపక్ష నాయకులు దేశానికి బాధ్యత వహించడానికి సుముఖత వ్య‌క్తం చేశారు.

"పౌరులందరి భద్రతతో సహా ప్రభుత్వ కొనసాగింపును నిర్ధారించడానికి నేను పార్టీ నాయకుల సిఫార్సును అంగీకరిస్తున్నాను, అఖిల పక్ష ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నేను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తాను' అని విక్రమసింఘే ట్విట్టర్‌లో రాశారు. అఖిలపక్ష ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు విక్రమసింఘే ప్రధానిగా కొనసాగుతారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

దేశంలో ఇంధన సంక్షోభం ఉందని, ఆహార కొరత ఉందని, ప్రపంచ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ దేశానికి రావాల్సి ఉందని విక్రమసింఘే అన్నారు. దేశ సుస్థిరతను నిర్ధారించడానికి మరొక ప్రభుత్వం వెంటనే బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం చాలా అవసరం. ఐఎంఎఫ్‌తో చర్చల వంటి ఆర్థిక పునరుద్ధరణకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని ఆయన కోరారు.

శ్రీలంకకు కొత్త ప్రధానిగా మే 12వ తేదీన రణిల్‌ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు. గ‌తంలో కూడా ఆయ‌న ప‌లుమార్లు ప్ర‌ధానిగా ప‌నిచేశారు.
















Next Story