ఎయిర్‌పోర్టు సిద్ధంగా ఉంది.. తాలిబన్లు కీలక ప్రకటన..!
Problems At Kabul Airport Resolved. అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత.. ఆప్ఘానిస్తాన్‌ను అక్రమించుకున్న తాలిబన్లు
By అంజి Published on 27 Sept 2021 8:09 AM ISTఅమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత.. ఆప్ఘానిస్తాన్‌ను అక్రమించుకున్న తాలిబన్లు అక్కడ నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అంతర్జాతీయ సమాజంతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తునే ఉన్నారు. అయితే వివిధ దేశాలు మాత్రం తాలిబన్లతో సత్సంబంధాలపై ఆచితూచి స్పందిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. అలాగే ఎయిర్‌లైన్స్ సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని, కాబూల్ ఎయిర్‌పోర్టులో సమస్యలు పూర్తి పరిష్కరించబడ్డాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. కాగా ఇప్పటికే పరిమిత సంఖ్యలో సహాయ, ప్రయాణికుల విమానాలు నడుస్తున్నాయి. కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ భయంకరమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో ఎయిర్‌పోర్టు కొంత దెబ్బతినగా.. దానిని ఖతార్, టర్నీ దేశాల సాంకేతి బృందంతో తిరిగి పునరుద్ధరించారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌తో సహా కొన్ని దేశీయ విమానాలు అక్కడ నడుస్తున్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ కహార్ బాల్ఖి మాట్లాడుతూ.. అంతర్జాతీయ విమానాలను నిలిపివేయడం వల్ల చాలా మంది ఆప్ఘాన్ పౌరులు విదేశాల్లో చిక్కుకుపోయారని, అలాగే చదువు, ఉద్యోగం కోసం వివిధ దేశాలకు వెళ్లే ఆప్ఘాన్ వాసులకు ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వసమస్యలు పరిష్కరించబడ్డాయని, దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకల కోసం ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆప్ఘానిస్తాన్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.