ఆ తప్పు నేను చెయకూడదనే రాజరికాన్ని వదులుకున్నాను - ప్రిన్స్ హ్యారీ
Prince Harry Says Moved To US To Break Cycle Of Family Pain And Suffering. రాజ కుటుంబం అంటే మనం ఎంతో అందంగా ఉహించుకుంటాం.
By Medi Samrat Published on 14 May 2021 9:07 AM GMTరాజ కుటుంబం అంటే మనం ఎంతో అందంగా ఉహించుకుంటాం. ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు అనీ, ఎలా కావాలంటే అలా ఉండొచ్చని బలంగా నమ్ముతాం. కానీ ఒక్కోసారి అలాంటి రాజ కుటుంబంలోని వ్యక్తుల మాటలు మనల్ని, మన నమ్మకాలనీ అంతకంటే బలంగా పక్కకునెట్టేస్తాయి. ఇందుకు ఉదాహరణ బ్రిటన్ యువరాజు హ్యారీ. బాధ పెట్టే బంధం నుంచి బయట పడటం కోసమే రాచరికాన్ని వదులుకున్నాను అన్నారు హ్యారీ . గురువారం ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన తన బాల్యం నుంచి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు.
తన పెంపకం విషయంలో తన తండ్రి ఇబ్బందులు పడ్డారని, అలా తను పడకూడదు అనే రాచారికాన్ని వద్దనుకుని అమెరికాకి వచ్చామన్నారు. ఈ విషయంలో తన తండ్రిని నిందించదలుచుకోలేదని, అయితే తన పిల్లల విషయంలో మాత్రం తన తండ్రి చేసిన తప్పు తను చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ఈ షో కు కొంత కాలం ముందు ప్రముఖ వ్యాఖ్యాత ఓఫ్రా విన్‌ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం హ్యారీ దంపతులు, రాజ కుటుంబంలో జాత్యాంహకారం గురించి కూడా కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. తాను ఇప్పటి వరకూ మూడు సార్లు చాలా నిస్సహాయుడిగా మిగిలిపోయినట్టు ఫీలయ్యానని, ఒకటి తన తల్లిని ఫోటోగ్రాఫర్లు వెంబడించినప్పుడు, రెండు ఆఫ్ఘనిస్తాన్‌లో ని హెలికాప్టర్‌లో ఉన్నప్పుడు, మూడు తన భార్య మొదటిసారి రాజారికపు ఇబ్బందుల గురించి తనకు చెప్పినప్పుడు అని చెబుతూ హ్యారీ ఈ షో లో చాలా ఎమోషనల్ అయ్యారు.
36 ఏళ్ల హ్యారీ బ్రిటిష్ రాణి మనుమడుగానే మనకి తెలుసు. హ్యారీకి 12 ఏళ్ల వయసులో ఆయన తల్లి ప్రిన్సెస్ డయానా ప్రమాదంలో మరణించారు. సింహాసనాన్ని అధిష్టించే వారి క్రమంలో అతను ఆరవ స్థానంలో ఉండేవాడు.. హ్యారీ మేఘన్ మార్కల్ ను 2018లో వివాహం చేసుకున్నారు. అయితే వారి తొలి సంతానం ఆర్చి పుట్టినపుడు ఆ బిడ్డకి ప్రిన్స్ టైటిల్ల్ ఇవ్వలేదు. ఇలా వివిధ కారణాలతో ఏడాది కిందట ఈ దంపతులు రాజరికాన్ని వదులుకున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నివాసం ఉంటూ స్వతంత్ర జీవితం గడుపుతున్నారు. రాయల్ కుటుంబంపై ఏ రకంగానూ ఆధారపడబోమని ప్రకటించిన ఈ దంపతులు తమ సంపాదన కోసం వివిధ చానళ్లకు కంటెంట్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.