ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం..ఎగసిపడిన సునామీ అలలు

ఇండోనేషియా సముద్ర తీరంలో గురువారం ఉదయం సంభవించిన శక్తివంతమైన భూకంపం ఆ దేశాన్ని వణికించింది.

By -  Knakam Karthik
Published on : 2 April 2026 9:13 AM IST

International News, Indonesia, Earthquake, Tsunami

ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం..ఎగసిపడిన సునామీ అలలు 

ఇండోనేషియా సముద్ర తీరంలో గురువారం ఉదయం సంభవించిన శక్తివంతమైన భూకంపం ఆ దేశాన్ని వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో మొలుక్కా సముద్రంలో 35 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ ప్రకంపనల ధాటికి సముద్రంలో స్వల్ప స్థాయిలో సునామీ తరంగాలు ఎగసిపడ్డాయి. బిటుంగ్‌లో 20 సెంటీమీటర్లు, వెస్ట్ హల్మహెరాలో 30 సెంటీమీటర్ల ఎత్తులో అలలు రికార్డయ్యాయి. ఫిలిప్పీన్స్‌లోని దావో తీరంలో కూడా 5 సెంటీమీటర్ల మేర అలలు ఎగసిపడినట్లు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

ఈ ప్రకృతి విపత్తులో ఉత్తర సులవేసికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం సుమారు 10 నుండి 20 సెకన్ల పాటు కొనసాగడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. టెర్నేట్ మరియు బిటుంగ్ నగరాల్లో పలు ఇళ్లు, ఒక చర్చి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. ఇండోనేషియా వెంబడి భూకంప తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, సుదూర ప్రాంతాలకు సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.

Next Story