దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్ బర్గ్ చేరుకున్నారు.
By Medi Samrat Published on 22 Aug 2023 6:40 PM ISTబ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్ బర్గ్ చేరుకున్నారు. వాటర్ క్లూఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ లో ఆయనకు సంప్రదాయబద్ధమైన రీతిలో స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు వద్దకు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్లకార్డులు, నినాదాలతో సందడి చేశారు. మోదీ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.15వ బ్రిక్స్ దేశాల సదస్సుకు జోహాన్నెస్ బర్గ్ నగరం ఆతిథ్యమిస్తోంది. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా దేశాధినేత షి జిన్ పింగ్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. మోదీ, జిన్ పింగ్ మధ్య భేటీ ఉండే అవకాశం ఉందని మాత్రం ప్రచారం సాగుతోంది. రష్యా తప్ప మిగతా బ్రిక్స్ దేశాల అధినేతలందరూ ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
బ్రిక్స్ సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించుకోవడానికి ఈ సమావేశం కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సారి బ్రిక్స్ సమావేశం వివిధ రంగాల్లో సభ్య దేశాల మధ్య బలమైన సహకారానికి సంబంధించిన అజెండాను పరిశీలిస్తుందని అన్నారు. ‘‘పేద దేశాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, బహుళపక్ష వ్యవస్థల సంస్కరణలను చర్చంచడానికి బ్రిక్స్ విలువైన వేదికగా మారిందని భావిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘‘జొహాన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళుతున్నాను. బ్రిక్స్-ఆఫ్రికా, బ్రిక్స్‌ప్లస్ సమావేశాలు కూడా జరగనున్నాయి. పేద దేశాల సమస్యలు, ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా మారింది’’ అని ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా ప్రయాణానికి ముందు ట్వీట్ చేశారు. బ్రిక్స్ దేశాల సదస్సు ఆగస్టు 22 నుంచి 24 వరకు జరగనుంది. ఆగస్టు 25న ప్రధాని మోదీ గ్రీస్ పర్యటనకు వెళ్లనున్నారు.