రష్యా పర్యటనను వాయిదా వేసుకున్న ప్రధాని మోదీ.. కారణం ఏమిటంటే..?
జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
By Medi Samrat
జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తత నెలకొంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనను వాయిదా వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే 9న మాస్కోలో జరగనున్న విక్టరీ డే పరేడ్‌కు ప్రధాని హాజరుకావడం లేదు. విక్టరీ డే పరేడ్‌కు ప్రధాని మోదీని రష్యా ఆహ్వానించింది.
వచ్చే నెలలో మాస్కోలో జరగనున్న విక్టరీ డే 80వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరుకావడం లేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ బుధవారం తెలిపారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. మే 9న జరిగే కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ప్రధాని మోదీకి బదులుగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
విక్టరీ డే వేడుకలకు హాజరుకావాలని, రెడ్ స్క్వేర్‌లో జరిగే విక్టరీ పరేడ్‌ను వీక్షించాలని మోదీతో పాటు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కూడా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని జీ జిన్‌పింగ్ ధృవీకరించారు. మాస్కోలో దాదాపు 20 మంది విదేశీ నేతలకు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
రష్యా మే 9న రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయాన్ని జరుపుకుంటుంది. ఈ సంవత్సరం 80వ వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావడానికి ఎంపిక చేసిన మిత్రరాజ్యాల దేశాల నాయకులను ఆహ్వానించింది.
అక్టోబరు 2000లో అధ్యక్షుడు పుతిన్ మొదటిసారిగా న్యూఢిల్లీ సందర్శించారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో వ్యూహాత్మక భాగస్వామ్య ప్రకటనపై సంతకం చేశారు. గత 25 సంవత్సరాలుగా ఈ భాగస్వామ్యం న్యూ ఢిల్లీ - మాస్కో మధ్య ప్రత్యేక భాగస్వామ్యంగా పరిణామం చెందింది.