పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తన ఉక్రెయిన్ పర్యటన అనుభవాన్ని అధ్యక్షుడు పుతిన్‌తో పంచుకున్నారు

By Medi Samrat  Published on  27 Aug 2024 3:57 PM IST
పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తన ఉక్రెయిన్ పర్యటన అనుభవాన్ని అధ్యక్షుడు పుతిన్‌తో పంచుకున్నారు. దీంతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఇటీవల ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలుసుకున్నారు. ఉక్రెయిన్‌కు సాధ్యమైన సహాయం అందిస్తామ‌ని చ‌ర్చించారు. చర్చల ద్వారానే వివాదానికి పరిష్కారం లభిస్తుందని ప్రధాని మోదీ వివిధ వేదికల నుంచి పునరుద్ఘాటించారు.

రెండవ ఉక్రెయిన్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఇండియా పేరును ప్రతిపాదించారు. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా కూడా జెలెన్స్కీ ఈ ప్రతిపాదనను ప్రధాని ముందు ఉంచారు. శాంతి సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నారు. జెలెన్స్కీ ప్రకటన దౌత్యపరంగా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. మొదటి ఉక్రెయిన్ శాంతి సదస్సు జూన్‌లో స్విట్జర్లాండ్‌లో జరిగింది, దీనికి 90కి పైగా దేశాలు హాజరయ్యాయి.

Next Story