ఒక‌సారి ఉక్రెయిన్ రండి.. ఏం జరిగిందో చూడండి.. ట్రంప్‌కు జెలెన్స్‌కీ ఆహ్వానం

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా సహా పలు దేశాలు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

By Medi Samrat
Published on : 14 April 2025 5:47 PM IST

ఒక‌సారి ఉక్రెయిన్ రండి.. ఏం జరిగిందో చూడండి.. ట్రంప్‌కు జెలెన్స్‌కీ ఆహ్వానం

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా సహా పలు దేశాలు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అక్కడ మరో శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగడం ఆప‌డం లేదు.

తాజాగా ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసింది. ఈ ఘటనలో 34 మంది మృతి చెందినట్లు సమాచారం. కాగా, ఉక్రెయిన్‌కు రావాలని, యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానించారు.

సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడిని ఒకసారి ఉక్రెయిన్ సందర్శించాలని కోరుతున్నారు. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు ఏం జరిగిందో ట్రంప్‌కి చూపించాలనేదే.. జెలెన్స్‌కీ ఆహ్వానం వెనుక కారణం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఉక్రెయిన్‌ను ఒకసారి సందర్శించి అక్కడి వాస్తవ పరిస్థితులను చూడాలని డోనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్షుడు జెలెన్స్‌కీ కోరారు.

ఏదైనా ఒప్పందంపై సంతకం చేసి, ఏదైనా నిర్ధారణకు వచ్చే ముందు అమెరికా అధ్యక్షుడు ఒకసారి ఉక్రెయిన్‌కు వచ్చి ఇక్కడి ఆసుపత్రులు, చర్చిలు, సాధారణ పౌరులు, యోధులను కలవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆదివారం ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా బాలిస్టిక్ క్షిపణితో దాడి చేయడం గమనార్హం. ఈ దాడిలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కాకుండా ఈ దాడిలో 100 మందికి పైగా గాయపడినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ దాడిపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా దాడిని ఖండించారు.

రష్యా-ఉక్రెయిన్ మధ్య 24 ఫిబ్రవరి 2022 నుండి యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో పాటు పలు దేశాలు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇంకా ఏదీ ఖరారు కాలేదు.

Next Story