అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని అరెస్టు చేసి జీవితకాల నిషేధం విధించారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే.. ఒక ప్రయాణికుడు విమానంలోని సిబ్బందిని కొట్టిన వీడియో వైరల్ అయింది. అతడు మెక్సికోలోని లాస్ కాబోస్ నుండి లాస్ ఏంజిల్స్‌కు ప్రయాణిస్తున్నాడు. సెప్టెంబర్ 21న అమెరికన్ ఎయిర్‌లైన్స్ 377 విమానంలో ఈ ఘటన జరిగింది. అదే అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఉన్న ఒక ప్రయాణికుడు తన ఫోన్‌లో మొత్తం ఘటన ను రికార్డ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చింది. విమానం LA లో ల్యాండ్ అయిన వెంటనే, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు వెంటనే ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తోంది. నారింజ రంగు డ్రెస్ వేసుకున్న వ్యక్తి.. మొదట విమాన సిబ్బందిని చెంపదెబ్బ కొట్టాడు.. ఆ తర్వాత అతడు వెనక్కు తిరిగి వెళ్లిపోతుండగా అతడిని వెనకాల నుండి కొట్టేసి.. పరిగెత్తుకుని పారిపోవడం మనం చూడొచ్చు. అతడు వెనక నుండి కొట్టిన సమయంలో విమానంలోని తోటి ప్రయాణీకులు అరవడం వీడియోలో స్పష్టంగా రికార్డు అయింది.
దాడి చేసిన వ్యక్తిని అలెగ్జాండర్ తుంగ్ క్యూ లేగా US న్యాయ శాఖ గుర్తించింది. 33 ఏళ్ల వ్యక్తి కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, అతను విమాన సిబ్బందితో కావాలనే గొడవ పెట్టుకున్నాడని అభియోగాలు మోపబడ్డాయి.