డొమెస్టిక్ ప్యాసింజర్ విమానం ఆదివారం తెల్లవారుజామున టాంజానియాలోని విక్టోరియా సరస్సులో కూలిపోయింది. వాయువ్య నగరమైన బుకోబాలో ల్యాండింగ్ చేయడానికి కొద్దిసేపటి ముందు ప్రతికూల వాతావరణం కారణంగా కూలిపోయిందని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. విమానాశ్రయానికి 100 మీటర్ల దూరంలో నీటిలో కూలిపోయిందని ప్రాంతీయ పోలీసు కమాండర్ విలియం మ్వాంపాఘలే బుకోబా విమానాశ్రయంలో విలేకరులతో అన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. టాంజానియాలోని అతిపెద్ద నగరం దార్ ఎస్ సలామ్ నుంచి ఈ విమానం బుకోబా పట్టణం వస్తోంది. బుకోబా ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే ప్రయత్నంలో, ఎయిర్ పోర్టును ఆనుకుని ఉన్న సరస్సులో కూలిపోయింది. వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది 26 మందిని కాపాడారు. వారిని ఆసుపత్రికి తరలించారు. "ప్రజలను రక్షించేందుకు భద్రతా బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నందున పరిస్థితి అదుపులో ఉంది" అని మ్వాంపాఘలే బుకోబా తెలిపారు.