పండోరా పేపర్స్.. ఎన్నో సంచలన విషయాలు బయటకు..

Pandora Papers Leak The Biggest Reveals So Far. పండోరా పేపర్స్.. రహస్య ఆర్ధిక లావాదేవీల వ్యవహారం సంచలనం రేపుతోంది.

By Medi Samrat  Published on  4 Oct 2021 6:14 AM GMT
పండోరా పేపర్స్.. ఎన్నో సంచలన విషయాలు బయటకు..

పండోరా పేపర్స్.. రహస్య ఆర్ధిక లావాదేవీల వ్యవహారం సంచలనం రేపుతోంది. రహస్య ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో ఇంటర్నేషనల్ కన్సోర్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం స్థూలంగా చెప్పాలంటే ఐసీఐజే బయటపెట్టిన రహస్య డాక్యుమెంట్లు ఇప్పుడు సంచలనం కల్గిస్తున్నాయి. 2016వ సంవత్సరంలో ప్రకంపనలు సృష్టించిన 'పనామా పేపర్స్' మాదిరిగానే 'పండోరా పేపర్స్' పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రహస్య పత్రాలను ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) బహిర్గతం చేసింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల పేర్లతో పాటు దేశంలోని ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలు, 150 మీడియా సంస్థలు, 6 వందలమంది జర్నలిస్టుల నుంచి సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ వివరాల్ని వెలువరించింది ఐసీఐజే సంస్థ. ధనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించి 12 మిలియన్ల పత్రాల్ని సేకరించినట్టు సంస్థ తెలిపింది. పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో బ్లాక్‌మనీని దాచుకునేందుకు, రహస్యంగా ఆస్థుల్ని కూడబెట్టేందుకు సూట్‌కేసు కంపెనీలకు సృష్టించారని వెల్లడించింది. రహస్యపు ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన పండోరా పేపర్స్ లో భారత్ నుంచి 3 వందల పేర్లున్నాయి. భారత్ నుంచి ఆరుగురు, పాకిస్తాన్ నుంచి ఏడుగురు రాజకీయ నేతల పేర్లున్నాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, కేబినెట్ మంత్రులకు కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నాయని పండోరా పేపర్స్ ఉన్నాయని అన్నారు.

పండోరా పేపర్స్ 2021 జాబితాలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు కూడా వచ్చింది. అయితే ఐసీఐజే నివేదిక సచిన్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. సచిన్ విదేశీ పెట్టుబడులన్నీ సక్రమమేనని, ఇన్‌కంటాక్స్ అధికారులు సైతం ఈ విషయాన్ని ధృవీకరించినట్టు పండోరా పేపర్స్ నివేదిక స్పష్టం చేసింది. సచిన్ తో పాటు పాప్ సింగర్ షకీరా, సూపర్ మోడల్ మిస్ షిఫ్ఫర్‌లకు కూడా ఐసీఐజే నివేదిక క్లీన్‌చిట్ ఇచ్చింది. పండోరా పేపర్స్ నివేదికలోని వివరాలు కేవలం ఆరోపణలు మాత్రమే. దర్యాప్తు చేయించడం లేదా వదిలేయడమనేది ఆయా ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అమెరికా, ఇండియా, పాకిస్తాన్, బ్రిటన్, మెక్సికో తదితర దేశాలకు చెందిన సంపన్నులు, రాజకీయ నేతలు ఈ లిస్టులో ఉన్నారు. చాలామంది సంపన్నుల రహస్య వ్యవహారాలు తమ దగ్గర ఉన్నాయని.. వాటిన్నంటినీ బహిర్గతం చేస్తామని ఐసీఐజే పేర్కొంది.


Next Story