నేడు చివరి రోజు.. సరిహద్దు వద్ద క్యూ కట్టిన వాహనాలు
జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
By Medi Samrat
జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సార్క్ వీసాపై భారత్‌కు వచ్చే పాకిస్థానీ పౌరుల నిష్క్రమణ గడువు ఏప్రిల్ 26తో ముగియగా, మెడికల్ వీసాపై వచ్చే వారికి మినహా మిగిలిన వారికి ఏప్రిల్ 27 ఆదివారంతో ముగియనుంది. పాకిస్థానీ పౌరులకు జారీ చేయబడిన మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకు చెల్లుబాటులో ఉంటాయి.
'నా తల్లి భారతీయురాలు, ఆమెను మాతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లనివ్వడం లేదు' అని టీనేజ్ యువతి సరిత కన్నీరుమున్నీరుగా చెప్పింది. ఆదివారం అట్టారీ సరిహద్దు వద్ద భారత్ నుండి నిష్క్రమించడానికి క్యూలో నిలబడిన వందలాది మందిలో ఆమె, ఆమె సోదరుడు, తండ్రి ఉన్నారు.
అమృత్‌సర్ జిల్లాలోని అట్టారీ సరిహద్దు వద్ద పాకిస్థానీ పౌరులు తమ దేశానికి వెళ్లేందుకు భారీగా వాహనాలలో బయలుదేరారు. దీంతో వాహనాలు బారులు తీరాయి. చాలా మంది భారతీయులు తమ పాకిస్థానీ బంధువులకు వీడ్కోలు పలికేందుకు అట్టారీకి వచ్చారు. ఏప్రిల్ 29న జరగనున్న బంధువుల పెళ్లి కోసం సరిత కుటుంబం ఇండియాకు వచ్చింది.
తొమ్మిదేళ్ల తర్వాత ఇండియాకు వచ్చామని సరిత చెప్పింది. నేను, నా సోదరుడు, నా తండ్రి పాకిస్థానీలు కాగా, నా తల్లి భారతీయురాలు అని పేర్కొంది. మా అమ్మను వెంట వెళ్లనివ్వబోమని వాళ్లు (అటారీ అధికారులు) చెబుతున్నారు. నా తల్లిదండ్రులు 1991లో వివాహం చేసుకున్నారు. భారతీయ పాస్‌పోర్టు ఉన్నవారిని అనుమతించబోమని చెబుతున్నారని ఆమె బోరున విలపిస్తూ చెప్పింది.
చాలా మంది పాక్ పౌరులు మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లోని తమ బంధువులను కలిసేందుకు వచ్చామని చెప్పారు. కొంతమంది వివాహాలకు హాజరయ్యేందుకు ఇక్కడికి వచ్చామని.. కానీ హాజరుకాకుండానే ఇంటికి తిరిగి వెళ్తున్నామన్నారు.
జైసల్మేర్‌కు చెందిన ఒక వ్యక్తి తన మామ, అత్త, వారి పిల్లలు 36 సంవత్సరాల తర్వాత తనను కలవడానికి వచ్చారని, అయితే వారు గడువు కంటే ముందే తిరిగి వెళ్తున్నారని చెప్పారు.