పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి
Pakistan train accident. పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ రైలు
By Medi Samrat Published on 7 Jun 2021 3:58 AM GMTఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ రైలు, మిలియట్ ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. రేతి-దహర్కి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుందని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ రైలు లాహోర్ కు వెళుతూ ఉండగా.. మిలియట్ ఎక్స్ప్రెస్ కరాచీ నుండి సర్గోదాకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఘోట్కి డిప్యూటీ కమీషనర్ ఉస్మాన్ అబ్దుల్లా మాట్లాడుతూ 'ఈ ప్రమాదంలో 30 మంది చనిపోయారని.. ఇంకో 50 మంది దాకా గాయపడ్డారని' తెలిపారు. 13 నుండి 14 బోగీల వరకూ పూర్తిగా పట్టాలు తప్పాయని... ఆరు నుండి ఎనిమిది బోగీలు.. పూర్తిగా ధ్వంసమయ్యాయని అబ్దుల్లా తెలిపారు. బోగీలలో ఇరుక్కుపోయిన ప్యాసెంజర్లను బయటకు తీస్తూ ఉన్నామని.. ఈ ఆపరేషన్ ఎంతో కష్టమైనది అన్నారు.
పెద్ద పెద్ద మెషినరీని ఉపయోగించి సహాయ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ఇంకా కొందరు ఇరుక్కుపోయి ఉన్నారని.. వారిని బయటకు తీస్తున్నామని అన్నారు. ఘటనా స్థలం వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. అలాగే గాయపడ్డ వాళ్లను సమీప ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ రేంజర్స్ సింధ్ కు చెందిన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొంది. రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టారు.