పాకిస్తాన్ ఇప్పుడు మరింత కష్టాల్లోకి వెళ్లనుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన మూడురోజుల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) సమావేశంలో పాకిస్తాన్‌ను ఏప్రిల్ 2022 వరకు గ్రే లిస్ట్‌లో ఉంచాలని నిర్ణయించారు. పాకిస్తాన్ ను జూన్ 2018 లో ఈ జాబితాలో చేర్చారు. అప్పటి నుండి పాక్ ఈ జాబితా నుండి బయటకు రావడానికి చాలాసార్లు ప్రయత్నించినా.. అది వీలుపడలేదు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం.. మనీ లాండరింగ్‌ను ఆపడంలో విఫలమైన కారణంగా పాకిస్తాన్ ను ఈ జాబితాలో చేర్చారు. ఈ లిస్టు నుంచి బయటపడటానికి గాను 27 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF) పాకిస్థాన్‌కు ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థల నాయకులపై దర్యాప్తు తో సహా ఇతర ఉగ్రవాద సంబంధిత విషయాలపై పాకిస్తాన్ ఎలాంటి చర్య తీసుకోలేకపోతుండడంతో పాక్ గ్రే లిస్టు నుండి బయటకు రాలేకపోతోంది.
యుఎస్ కాంగ్రెస్ ఇచ్చిన 'పాకిస్తాన్‌లో ఉగ్రవాద.. ఇతర మిలిటెంట్ గ్రూపులు' నివేదిక ప్రకారం పాక్ లో కనీసం 12 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. పాకిస్తాన్ ఎల్లప్పుడూ ఉగ్రవాద సంస్థలకు సురక్షితమైన స్వర్గధామంగా ఉందని స్పష్టం చేసింది. పాక్ ఈ లిస్టులో ఉండడం వలన అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాం, యూరోపియన్ యూనియన్ నుండి ఆర్థిక సహాయం పొందడంలో పాకిస్తాన్ ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా ఎంతగానో దిగజారిపోయింది. రాబోయే రోజుల్లో ఈ లిస్టు నుండి పాక్ బయటకు రాకపోతే మాత్రం మరిన్ని కష్టాలు తప్పవు.