భారత్‌కు సెల్యూట్‌ చేస్తున్నా: పాక్ ప్రధాని

Pakistan PM Imran Khan praises India's foreign policy. తన పదవికి ఎసరొచ్చేసరికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వరం మారింది. ఎప్పుడూ లేనిది

By అంజి  Published on  21 March 2022 8:55 AM IST
భారత్‌కు సెల్యూట్‌ చేస్తున్నా: పాక్ ప్రధాని

తన పదవికి ఎసరొచ్చేసరికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వరం మారింది. ఎప్పుడూ లేనిది కొత్తగా భారత ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. భారత్ విదేశాంగ విధానం భేష్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఖైబర్ ఫఖ్తూంక్వాలోని మలాఖండ్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. దేశ పౌరుల కోసం భారత్ ఎంతకైనా తెగిస్తుందని, ఏ ఒత్తిళ్లకు లొంగకుండా భారత్‌ ఉంటుందన్నారు. పాక్‌ ఆర్మీని తిడుతూ భారత్‌ ఆర్మీని పొగిడారు. ప్రభుత్వంలో భారత్ ఆర్మీ జోక్యం చేసుకోదన్నారు. డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకోలేనని, రాజీనామాకు ఎప్పుడైనా సిద్ధమే అంటూ ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. కాగా పాక్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తుతం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నారు. తన హయాంలో పాక్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. విదేశాంగ విధానంలో ఇమ్రాన్ ఖాన్‌ ఫెయిల్‌ అయ్యారంటూ గగ్గోలు పెడుతున్నాయి.

''తాను భారతదేశానికి వందనం చేస్తున్నాను. భారత్ ఎల్లప్పుడూ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తుంది. క్వాడ్ కూటమిలో భారత్ సభ్య దేశం, యునైటెడ్ స్టేట్స్ దాని సభ్యదేశాలలో ఒకటి. కానీ భారతదేశం ఇప్పటికీ ఉక్రెయిన్ విషయంలో తటస్థంగా ఉన్నామని చెబుతోంది. ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది. ఎందుకంటే భారతదేశ విదేశాంగ విధానం దాని ప్రజల కోసం" అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో బహిరంగ ర్యాలీని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్.. తన విదేశాంగ విధానం పాకిస్తాన్ ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుందని తన మద్దతుదారులతో అన్నారు. "నేను ఎవరి ముందు తలవంచలేదు. నా దేశాన్ని కూడా తలవంచనివ్వను" అని ఖాన్ అన్నారు. అతను పార్లమెంటులో తనపై అవిశ్వాస తీర్మానానికి ముందు ప్రజల మద్దతును కూడగడుతున్నాడు.










Next Story