పాకిస్తాన్ దేశంలో అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దోషులను కఠినంగా శిక్షించేలా రూపొందించిన బిల్లుకు పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. గతేడాది ఈ బిల్లుకు ఆర్డినెన్స్ జారీ కాగా.. తాజాగా పాకిస్తాన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అత్యాచార కేసుల్లో నిందితులుగా తేలిన వారికి కెమికల్స్ ద్వారా హోర్మోన్లను తగ్గించే శిక్షను విధించేలా బిల్లు రూపొందించారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌లో మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలు చాలా పెరిగాయి. దీంతో ఈ దారుణాలను నియంత్రించాలంటూ దేశ వ్యాప్తంగా డిమాండ్‌తో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం రేపిస్టులను కఠినంగా శిక్షించేలా కొత్త చట్టాన్ని చేసింది.
అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారికి రసాయనాల ద్వారా పురుష కణాలను నిర్వీర్యం చేసి నపుంసకత్వం వచ్చేలా శిక్షను అమలు చేయాలని బిల్లు తయారు చేశారు. అత్యాచార కేసుల్లో నిందితుల వాంగ్మూలం తీసుకున్న తర్వాతే కెమికల్స్‌తో శిక్షించాలని బిల్లులో పేర్కొన్నారు. నేర చట్ట సవరణ బిల్లు 2021తో పాటు మరో 33 బిల్లులకు పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దోషులకు విధించే కెమికల్ క్యాష్ట్రేషన్ శిక్షలో భాగంగా డ్రగ్స్ వాడననున్నారు. మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో నిందితులకు డ్రగ్స్ ఇస్తారు. అయితే ఈ బిల్లును జమాత్ ఇ ఇస్లామి సేనేటర్ ముస్తాక్ వ్యతిరేకించారు. ఇది ముస్లిం చట్టానికి, విశ్వాసాలకు వ్యతిరేకమని మాట్లాడారు.