భారత జాలర్లపై కాల్పులు జరిపిన పాక్ నేవీ
Pakistan Navy kills one Indian fisherman off Gujarat Coast. పాకిస్తాన్ నేవీ మరోసారి తన బుద్ధి చూపించింది. గుజరాత్ తీరంలో ఆదివారం భారత జాలర్ల
By Medi Samrat
పాకిస్తాన్ నేవీ మరోసారి తన బుద్ధి చూపించింది. గుజరాత్ తీరంలో ఆదివారం భారత జాలర్ల పడవపై పాక్ నేవీ కాల్పులు జరిపింది. బుల్లెట్ గాయాలకు ఓ మత్స్యకారుడు మృతి చెందగా.. మరో మత్స్యకారుడు గాయపడ్డాడు. చనిపోయిన వ్యక్తిని శ్రీధర్‌గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టానికి తరలించారు. గాయపడ్డ మరో వ్యకిని ద్వారకలోని ఆసుప్రతికి చేర్పించగా.. చికిత్స పొందుతున్నాడు. ఎటువంటి హెచ్చరికలు కూడా లేకుండా పాకిస్తాన్ నేవీ తమపై కాల్పులు జరిపిందని జాలర్లు తెలిపారు. పాక్ ఇప్పటికే చాలా మంది జాలర్లను అరెస్టు చేసింది. ఎంతో మంది ఇంకా పాక్ జైళ్లలో మగ్గుతూ ఉన్నారు.
మెరైన్ కమాండోలు పడవను కూడా స్వాధీనం చేసుకున్నారు మరియు మరో ఆరుగురు మత్స్యకారులను అపహరించారు. గుజరాత్‌లోని ద్వారక దగ్గర ఓఖా పట్టణానికి సమీపంలో భారతీయ మత్స్యకారులు భారతీయ జలాల్లో చేపలు పట్టే సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ కు చెందిన మెరైన్ కమాండోస్ బోట్ వచ్చి 'జల్‌పరి' అనే భారత బోటుపై కాల్పులు జరిపారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
గతేడాది ఏప్రిల్‌లో పాక్ నేవీ రెండు పడవలపై కాల్పులు జరిపింది. ఆ సమయంలో బోట్లలో ఎనిమిది మంది ఉండగా.. యూపీకి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు. మార్చిలో 11 మంది భారత జాలర్లను అరెస్టు చేశారు. అంతకు ముందు మార్చిలోనూ పాక్ మరో 11 మంది మత్స్యకారులను అరెస్టు చేసి, రెండు బోట్లను సీజ్ చేసింది. ఫిబ్రవరిలో కూడా పాక్ జలాల్లోకి ప్రవేశించినందుకు 17 మంది జాలర్లను అరెస్టు చేసి, మూడు పడవలను స్వాధీనం చేసుకున్నది.