పాక్‌కు మరో షాక్, భారత్‌లో ఆ దేశ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాపై బ్యాన్
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్ అకౌంట్‌ను భారత ప్రభుత్వం నిలిపివేసింది.
By Knakam Karthik
పాక్‌కు మరో షాక్, భారత్‌లో ఆ దేశ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాపై బ్యాన్
జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై దౌత్యపరమైన కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్ అకౌంట్‌ను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్‌పై ఆ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ఖాతాను ఓపెన్ చేసిన వారికి ఒక సందేశం దర్శనమిస్తోంది.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోంది. అంతకుముందు భారత్‌లో పాకిస్థాన్ ‘ఎక్స్’ ఖాతాను కేంద్రం నిలిపివేసిన విషయం తెలిసిందే. పెహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను యాక్సెస్ చేయకుండా నిలిపివేసింది. పలువురు పాకిస్థాన్ జర్నలిస్టులకు చెందిన ఎక్స్ ఖాతాలను కూడా నిషేధించినట్లు తెలిసింది. అంతేకాదు, తప్పుడు, రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లపై సోమవారం నిషేధం విధించింది. ఇందులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్‌కు చెందిన యూట్యూబ్ చానల్ కూడా ఉన్నది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్, ది పాకిస్థాన్ రెఫరెన్స్ తదితర యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ క్రమంలోనే రక్షణ మంత్రి ఖాతాను బ్లాక్ చేసింది.