పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కష్టాలు తగ్గడం లేదు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)పై నిషేధం విధించే అవకాశం ఉంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. పీటీఐపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు. పాకిస్థాన్ పునాదులపై పీటీఐ దాడి చేసిందని ఆయన అన్నారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు. దీన్ని సహించలేమన్నారు.
ఆర్మీ చట్టం కింద నిందితులపై చర్యలు తీసుకునేందుకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ బిల్లును మే 9న ఆమోదించింది. జాతీయ అసెంబ్లీలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇమ్రాన్ అరెస్టుకు నిరసనగా మే 9న పీటీఐ కార్యకర్తలు సైనిక స్థావరంపై దాడి చేశారు.
కాగా మంగళవారం కోర్టు ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీ లకు ఉపశమనం కల్పించింది. గత మార్చిలో జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో ఎనిమిది హింసాత్మక కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ మధ్యంతర బెయిల్‌ను పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు (ATC) జూన్ 8 వరకు పొడిగించింది. అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు.. బుష్రా బీబీకి మే 31 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
మార్చి 18న పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు హాజరైన సమయంలో న్యాయ ప్రాంగణంలో పోలీసులు, పీటీఐ కార్యకర్తల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో ఇమ్రాన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు ఇమ్రాన్ మధ్యంతర బెయిల్ గడువును పెంచింది.