సరిహద్దు మార్పుపై రక్షణ మంత్రి వ్యాఖ్యలు.. ఉలిక్కిపడ్డ పాకిస్తాన్..!
సరిహద్దు మార్పుపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేసిన ప్రకటనపై పాకిస్థాన్ ఉలిక్కిపడింది.
By - Medi Samrat |
సరిహద్దు మార్పుపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేసిన ప్రకటనపై పాకిస్థాన్ ఉలిక్కిపడింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సింధీ కమ్యూనిటీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం సింధ్ భౌగోళికంగా భారతదేశంలో లేనప్పటికీ, ఒక నాగరికతగా, సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుంది. భవిష్యత్తులో సింధ్ మళ్లీ భారతదేశంలో భాగం అవొచ్చు అని అన్నారు. రక్షణ మంత్రి చేసిన ఈ ప్రకటనపై పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో.. రాజ్‌నాథ్ సింగ్ మాటలు హిందుత్వ ప్రమాదకరమైన పరివర్తన, విస్తరణ ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. సింధ్ ప్రావిన్స్‌కు సంబంధించి భారత రక్షణ మంత్రి చేసిన తప్పుదోవ పట్టించే.. ప్రమాదకరమైన రూపాంతరం కలిగించే వ్యాఖ్యలను పాకిస్థాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇటువంటి ప్రకటనలు స్థాపించబడిన సత్యాలను సవాలు చేయడానికి.. అంతర్జాతీయ చట్టాన్ని, గుర్తించబడిన సరిహద్దుల సమగ్రతను, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని స్పష్టంగా ఉల్లంఘించేలా చేసే విస్తరణవాద హిందుత్వ భావజాలాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొంది.
ఆదివారం ఢిల్లీలో జరిగిన సింధీ కమ్యూనిటీ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్.. సింధ్, భారత్ మధ్య సాంస్కృతిక, నాగరికత సంబంధాలపై సీనియర్ బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ రాసిన విషయాలను ప్రస్తావించారు.
1947 విభజన సమయంలో అద్వానీ తరానికి చెందిన చాలా మంది సింధీ హిందువులు సింధ్‌ను విడదీయడాన్ని ఎప్పటికీ అంగీకరించలేరని ఆయన అన్నారు. సింధ్ ఈ రోజు పాకిస్తాన్‌లో భాగమైనప్పటికీ, 'సరిహద్దులు మారవచ్చు' 'రేపు సింధ్ భారత్‌కు తిరిగి రావచ్చు' అని రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.
సింధ్‌లోని హిందువులు, చాలా మంది ముస్లింలకు సింధు నది లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని.. దాని పవిత్రతను మక్కాలోని ఆబ్-ఎ-జంజామ్‌తో పోల్చారు. ఈ రోజు సింధ్ భూమి భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ నాగరికత ప్రకారం, సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగమేనని ఆయన అన్నారు. సరిహద్దులు మారవచ్చు. ఎవరికి తెలుసు, రేపు సింధు భారతదేశానికి తిరిగి రావచ్చు అని వ్యాఖ్యానించారు.