భారత్-చైనా బోర్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు.. చైనా సైన్యంలో పాక్ సైనిక అధికారులు
Pakistan Army Officers Deployed In Chinese PLA’s Western And Southern Theatre Command. లడఖ్ సరిహద్దుల్లో మరోసారి చైనా తోక జాడిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 3 Oct 2021 3:48 PM IST
లడఖ్ సరిహద్దుల్లో మరోసారి చైనా తోక జాడిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! చైనా లడఖ్‌లో సైనిక దళాల మోహరింపు, ఆయుధాల విస్తరణను పెంచుతున్నది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ధ్రువీకరించారు. చైనా, పాకిస్తాన్ చేష్టలను భారత విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తున్నది. ఎప్పుడు ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. పెద్ద ఎత్తున భారత్ కూడా సైన్యాన్ని మోహరించింది.
చైనా సైన్యంలో పాక్ సైనిక అధికారుల రహస్యంగా మోహరించినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) కు సాయం చేయడానికి పాకిస్తాన్ అధికారులు చైనా సైన్యంతో కలుస్తున్నట్లు తెలుస్తోంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ, సైన్యం ఈ విషయాలపై నిశితంగా గమనిస్తున్నాయి. చైనా, పాకిస్తాన్ కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్న విషయాన్ని ఇంటెలిజెన్స్ నివేదిక బయటపెట్టింది. పాకిస్తాన్ సైనిక అధికారులు చైనా సైన్యం పశ్చిమ, దక్షిణ కమాండ్‌లో నియమితులయ్యారని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. పశ్చిమ కమాండ్ లడఖ్‌లో మోహరించగా, దక్షిణ కమాండ్ టిబెట్ ప్రాంతంలో ఉన్నది. పాకిస్తాన్ సైనిక అధికారులకు ఈ రెండు ప్రాంతాల కార్యాలయాల్లో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బీజింగ్‌లోని చైనా రాయబార కార్యాలయంలో దాదాపు 10 మంది పాకిస్థాన్ సైనిక అధికారులు కూడా నియమించబడినట్లు సమాచారం.
చైనాతో భారత్ సైనిక చర్చలు వచ్చే వారం జరుగుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 12 రౌండ్ల పాటు చర్చలు జరగ్గా.. 13వ రౌండ్ సైనిక చర్చల సన్నాహాల్లో భాగంగా ఇరువైపులా నోట్స్‌ను మార్చుకున్నట్లు అధికారులు తెలిపారు. హాట్ స్ప్రింగ్స్, పలు ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై వచ్చే కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. చర్చలు జరిగే తేదీలు, వేదికపై త్వరలోనే ప్రకటన రానుంది.