ప్రధాని మోదీ భారత్‌కు రాగానే.. చైనా అధ్యక్షుడి చుట్టూ చేరిన పాక్ నేతలు..!
SCO సమ్మిట్ సెప్టెంబర్ 1న చైనాలోని షాంఘైలో ముగిసింది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.
By Medi Samrat
SCO సమ్మిట్ సెప్టెంబర్ 1న చైనాలోని షాంఘైలో ముగిసింది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రధాని మోదీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కరచాలనం చేసి నవ్వుతూ.. పుతిన్‌ను కౌగిలించుకుని.. కారులో తిరిగిన అన్ని వీడియోలు, ఫోటోలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.
ఇంతలో ఒక ఫోటో వైరల్ అయ్యింది. అందులో PM మోడీ, పుతిన్ మాట్లాడుకోవడం.. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ వెనుక ఒంటరిగా నిలబడి ఉండటం చూడవచ్చు. షాబాజ్‌ను ప్రధాని మోదీ పూర్తిగా విస్మరించారు.
ఈ సమ్మిట్ తర్వాత ప్రధాని మోడీ భారతదేశానికి తిరిగి వచ్చారు. అయితే పాకిస్తాన్ ప్రధాని ఇప్పటికీ చైనాలోనే ఉన్నారు. ఆరు రోజుల పర్యటన కోసం అక్కడికి వెళ్లారు. అతడిని అనుసరించి పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సోమవారం చైనా చేరుకున్నారు. చైనా చేరుకున్న తర్వాత మునీర్ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలిశాడు. మంగళవారం.. షెహబాజ్ షరీఫ్ బీజింగ్‌లోని గ్రేట్ హాల్‌లో జి జిన్‌పింగ్‌ను కలిశారు. ఈ సమయంలో మునీర్ కూడా అతనితో కనిపించాడు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ఈ ప్రాంతంలోని పరిస్థితి, వ్యూహాత్మక సహకారం, ముఖ్యమైన ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇందులో మునీర్ మాత్రమే కాకుండా పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా పాల్గొన్నారు.
చైనా అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో షీ జిన్‌పింగ్‌ను షెహబాజ్ షరీఫ్ కొనియాడారు. ఆయనను శక్తి, స్థిరత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. చైనా-పాకిస్తాన్‌ల మధ్య స్నేహం విడదీయలేనిదని, ఇద్దరూ 'ఉక్కు సోదరులు' అని, తాము ఉమ్మడి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని షాబాజ్ అన్నారు.
ఈ సమావేశానికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఆర్మీ చీఫ్ మునీర్ కూడా షాబాజ్ షరీఫ్ దగ్గర కూర్చున్నట్లు కనిపించారు. సోమవారం జరిగిన SCO సమావేశంలో మునీర్ కూడా పాల్గొన్నాడు. దీంతో పాకిస్థాన్‌లో అసలు అధికారం ఎవరిది అని ప్రపంచానికి మరోసారి తెలిసింది. బుధవారం చైనాలో నిర్వహిస్తున్న విక్టరీ డే పరేడ్‌లో మునీర్ కూడా పాల్గొంటారని విశ్వసనీయ సమాచారం. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3న చైనాలో విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తారు.