కరోనాతో సమావేశానికి హాజరైన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Pak PM Imran Khan Meets Aides Despite Testing Covid Positive. కరోనా వైరస్ కలవరం పుట్టిస్తోన్న తరుణంలో..పాకిస్థాన్ ప్రధాని

By Medi Samrat
Published on : 27 March 2021 9:07 AM IST

కరోనాతో సమావేశానికి హాజరైన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

కరోనా వైరస్ కలవరం పుట్టిస్తోన్న తరుణంలో..పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చర్య విమర్శలకు దారితీస్తోంది. గత శనివారం కరోనా బారిన పడిన 68 ఇమ్రాన్ ఖాన్ ఇటీవలే కరోనా నివారణ కోసం చైనా తయారుచేసిన వాక్సిన్ వేసుకున్నారు. అయితే వాక్సిన్ వేసుకున్న తరువాత కొద్ది రోజులకే ఆయనకు, ఆయన భార్యకు పాజిటివ్ అని తేలింది. తాజాగా తన మీడియా బృందంతో నిర్వహించిన సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇప్పుడు ఆయన తీరుపై విపక్షాలు, ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది.

పాకిస్తాన్ కొవిడ్ నిబంధనల ప్రకారం..కరోనా బాధితులు తొమ్మిది నుంచి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. కానీ, ప్రధాని మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తూ నాలుగు రోజులకే సమావేశానికి హాజరయ్యారు. ఆయనతో పాటు ఉన్న సమాచార శాఖ మంత్రి శిబ్లి ఫరాజ్ సమావేశం జరిగినప్పటి చిత్రాన్ని ట్విటర్‌లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో అందరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ దర్శనమిచ్చారు.

ఎన్నో వీడియో కాన్ఫరెన్స్ యాప్స్‌ ఉండగా..ప్రధాని ప్రత్యక్షంగా సమావేశానికి హాజరుకావాల్సిన అవసరం ఏంటని ఈ వ్యవహారంపై నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తోన్న సమయంలో స్వయంగా ప్రధానే నిబంధనలు ఉల్లంఘించారని, ఆ సమావేశానికి హాజరైన వారందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వివాదంపై స్పందించేందుకు ఒక్క అధికార ప్రతినిధి కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. మరోవైపు, దీనిపై పాకిస్థాన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సజ్జాద్ మాట్లాడారు. కొవిడ్‌తో బాధపడుతున్న రోగులు ఇతరులను కలవకూడదన్నారు. ఇలాంటి ప్రత్యక్ష సమావేశాల వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయన్నారు. అత్యవసరమైతే, వీడియో కాన్ఫరెన్స్‌ వేదికను వినియోగించుకోవాల్సి ఉందని తెలిపారు.




Next Story