భారత్ లో కరోనా కల్లోలం తగ్గాలని కోరుకుంటున్న పాకిస్థాన్

Pak PM Imran Khan expresses solidarity with India over COVID-19 crisis. భారతదేశంలో కరోనా కల్లోలంపై పలు దేశాలు ఆందోళన

By Medi Samrat  Published on  24 April 2021 7:03 PM IST
భారత్ లో కరోనా కల్లోలం తగ్గాలని కోరుకుంటున్న పాకిస్థాన్

భారతదేశంలో కరోనా కల్లోలంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పాకిస్థాన్ కూడా భారత్ లో కరోనా ఉధృతి తగ్గాలని కోరుకుంటూ ఉంది. సామాజిక మాధ్యమాల్లో పాకిస్థాన్ యువత కూడా భారత్ లో ప్రజలు కోలుకోవాలని ఎన్నో పోస్టులు పెడుతూ ఉన్నారు. కోవిడ్-19 మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడదామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఈ వైరస్ విసురుతున్న సవాలును ఎదుర్కొనడంలో భారత దేశానికి సంఘీభావం ప్రకటించారు. పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ వ్యాధి బారిన పడినవారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ శనివారం ఓ ట్వీట్ చేశారు. భారతీయులు ప్రమాదకరమైన కోవిడ్-19 ప్రభంజనంతో యుద్ధం చేస్తున్నారని, వారికి సంఘీభావం ప్రకటిస్తున్నానని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. మానవాళి ఎదుర్కొంటున్న ఈ అంతర్జాతీయ సవాలుపై మనమంతా కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు.

పాకిస్థానీలు శుక్రవారం ట్విటర్ వేదికగా భారత దేశంపై సానుభూతి ప్రకటించారు. భారత దేశానికి ఈ కష్టకాలంలో సాయపడాలని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను కోరారు. కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం వల్ల భారతీయులు ఆక్సిజన్ కొరత, ఇతర అత్యవసర సాయం కోసం ఎదురు చూస్తున్నారని, వారికి సాయపడాలని ఖాన్‌ను కోరారు. #ఇండియానీడ్స్ఆక్సిజన్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉంచారు.

భారత దేశానికి అండగా ఉంటామని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ తెలిపారు. శనివారం ఆయన ట్విటర్ వేదికగా భారత దేశానికి సంఘీభావం ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత దేశంలోని మిత్రులకు సహాయంగా నిలుస్తామన్నారు. "కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం ఇబ్బందుల్లో ఉన్న భారత దేశంలోని మా స్నేహితులకు ఆస్ట్రేలియా అండగా ఉంటుంది. భారత దేశం ఎంత బలమైనదో, కోలుకునే సమర్థతగలదో మాకు తెలుసు. ఈ ప్రపంచ సవాలుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నేను భాగస్వాములుగా కలిసి పని చేస్తాం'' అని ట్వీట్ చేశారు.


Next Story