భారత దేశంపైనా, భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరవకముందే మరో మంత్రి తన నోటికి పని చెప్పారు. తమ దగ్గర అణుబాంబు ఉందని.. ఈ విషయాన్ని భారత్ మరవద్దని మంత్రి షాజియా మర్రీ హెచ్చరికలు పంపించింది. ఆదివారం షాజియా మర్రీ ట్వీట్ లో 'పాకిస్తాన్ బాధ్యతాయుతమైన అణు దేశంగా ఉంది. భారత మీడియా కొన్ని అంశాల్లో భయాన్ని సృష్టిస్తోంది. భారత మంత్రి ప్రేరేపిత వ్యాఖ్యలపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి స్పందించారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ భారత్ కంటే చాలా ఎక్కువ త్యాగం చేసింది' అని ఆమె ట్వీట్ చేసింది. పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందనే విషయాన్ని మా దేశం కూడా మరిచిపోకూడదని తెలిపారు. అయితే ఈ హోదా ఉద్దేశం నిశ్శబ్దంగా ఉండడం కాదని, ఒకవేళ అవసరం వస్తే వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు.
తమ అణ్వస్త్ర హోదా మౌనంగా ఉండేందుకు కాదని, అవసరమైతే వెనుకంజ వేసే ప్రసక్తేలేదని షాజియా స్పష్టం చేశారు. పాక్ చెంపమీద కొడితే ఊరికే చూస్తూ ఉండిపోదు. అదే స్థాయిలో బదులిస్తుందని అన్నారు షాజియా. భారత ప్రధాని మోదీ దేశంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. హిందూయిజం, హిందుత్వ అంశాలు మోదీ ప్రభుత్వంలో విజృంభిస్తున్నాయని.. భారత్ ముస్లింలను ఉగ్రవాదంతో ముడివేస్తోందని షాజియా ఆరోపించారు.