ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో రుతుపవనాల కారణంగా సంభవించిన వినాశకరమైన వరదల వల్ల 24 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వెయ్యికి పైగా గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి చేసిన వింత ప్రకటన వెలుగులోకి వచ్చింది.
రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. వరద బాధిత ప్రజలు వరద నీటిని కాలువలలోకి వెళ్లకుండా తమ ఇళ్లలో కంటైనర్లు, టబ్‌లలో నిల్వ చేయాలని కోరారు. ఈ వరదను పాకిస్థానీలు ఒక వరంలా చూడాలని అన్నారు. పాకిస్తాన్ న్యూస్ ఛానెల్‌తో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. “వరద పరిస్థితులపై నిరసనలు చేస్తున్న వారు వరద నీటిని తమ ఇళ్లకు తీసుకెళ్లాలి. ఈ నీటిని ప్రజలు తమ ఇళ్లలోని తొట్టెలు, పాత్రల్లో నిల్వ చేసుకోవాలి. ఈ నీటిని మనం ఒక వరంగా భావించి నిల్వ చేసుకోవాలని సూచించారు. పాకిస్థాన్‌లో పెద్ద ప్రాజెక్టుల కోసం 10-15 ఏళ్ల పాటు ఎదురుచూసే బదులు, త్వరగా నిర్మించగలిగే చిన్న డ్యామ్‌లను నిర్మించాలని ఆసిఫ్ అన్నారు. వరద నీటిని వృధా చేయకుండా నిల్వ చేసుకోవాలన్నారు.
పంజాబ్ సమాచార మంత్రి అజ్మా బుఖారీ ప్రకారం.. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో రికార్డు స్థాయిలో వరదలు సంభవించడంతో 2 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) డేటా ప్రకారం.. జూన్ 26 నుండి ఆగస్టు 31 వరకు వరదల కారణంగా 854 మంది పాకిస్థానీలు మరణించగా.. 1,100 మందికి పైగా గాయపడ్డారు.