ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ అస్వాన్‌లో 500 మందికి పైగా తేళ్లు కాటుకు గురయ్యాయని తాత్కాలిక ఆరోగ్య మంత్రి ఖలీద్ అబ్దెల్ గఫార్ తెలిపారు. అస్వాన్ ప్రాంతంలో ఇటీవల వడగళ్ల వానలు, భారీ వర్షం కురిసింది. దీంతో తేళ్లు వాటి బొరియల నుండి బయటకు వచ్చేసాయి. వీధుల్లోకి, ఇళ్లలోకి వచ్చేశాయి. అస్వాన్ నగరంలో తేలు కాటుతో ముగ్గురు మృతి చెందినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. వారాంతంలో అస్వాన్ ప్రావిన్స్‌లో కురుస్తున్న వర్షాలు, వడగళ్ళు మరియు ఉరుములతో స్థానిక అధికారులు పాఠశాలలను మూసివేశారని గవర్నర్ అష్రఫ్ అటియా తెలిపారు. తుఫానుల కారణంగా తేళ్లు బయటకు వచ్చి ప్రావిన్స్‌లోని అనేక ఇళ్లలోకి చొరబడ్డాయని తెలిపారు.
తేలు కుట్టడంతో కనీసం 503 మంది ఆసుపత్రిలో చేరారని, వారందరికీ తేలు కాటుకు విరుగుడు డోస్ ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. తేలు కుట్టడం వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని తాత్కాలిక ఆరోగ్య మంత్రి ఖలీద్ గఫర్ ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో ప్రసారం చేయబడిన ఫోటోలు మరియు వీడియో ఫుటేజీలలో వరదల కారణంగా ఇళ్ళు, వాహనాలు మరియు వ్యవసాయ పొలాలు దెబ్బతిన్నాయని చూపించాయి. వర్షాల కారణంగా విద్యుత్‌కు కూడా అంతరాయం ఏర్పడింది. తాత్కాలిక ఆరోగ్య మంత్రి ప్రకారం, ఈజిప్టులోని అన్ని ఆసుపత్రులలో తగినంత యాంటీ-వెనమ్ ఉంది. ప్రస్తుతం అస్వాన్ గవర్నరేట్‌లోని ఆసుపత్రులలో 3,350 మోతాదులు అందుబాటులో ఉన్నాయి.